అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆది నుంచి వివాదాస్పదుడిగా పేరొందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. సొంత పార్టీ నేతలకే కొరకరాని కొయ్యగా మారారు. కొంత కాలంగా బీసీలకు రాజ్యాధికారం కావాలంటూ నినదిస్తున్న ఆయన ఇటీవల మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జనలో సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలను విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి కూర్చోబెడితే ‘పాలు తాగి రొమ్ము గుద్దినట్లు’.. సొంత పార్టీ నేతలపైనే తిరగబడుతున్నారని మండిపడుతున్నారు.

బీసీ గర్జన సభలో నేతలపై విమర్శలు

బీసీల ఓట్లతో గెలిచిన రెడ్లు.. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఖమ్మం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సైతం తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పొంగులేటికి అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ప్రాజెక్టుల పేరుతో పొంగులేటి ప్రజల సొమ్మును దోచుకున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డినే రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం అని, మిర్యాలగూడకు ఓసీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆఖరి అంటూ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. త్వరలోనే రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రాబోతుందంటూ జోస్యం చెప్పారు. బీసీల ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరన్నారు. మరోసారి మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. ఓ మంత్రి భాజపాతో టచ్‌లో ఉంటున్నారన్నారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేలా సదరు మంత్రి వ్యవహరిస్తారంటూ వెల్లడించారు.

కాంగ్రెస్ నేతల నిరసన

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మల్లన్న తన నోరును అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. కొందరితో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తున్నారన్నారు. మల్లన్న వెనుక కేంద్రమంత్రి బండి సంజయ్ ఉన్నారని ఆరోపించారు.