అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. సోమవారం అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లకు ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పదినెలల్లో ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు అర్థంమైందనే కేసీఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేంలేదని వ్యాఖ్యనించారు. పదినెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని, రైతులు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్‌ ఉద్యోగాలకు పరీక్షలు విజయవంతంగా నిర్వహించామన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్‌ను మర్చిపోయిందన్నారు. ‘మీరులేకపోయినా ఏం బాధలేదు. మీతో ప్రజలకేం పనిలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి. బడి దొంగలను చూసాం.. కానీ ప్రతిపక్షం నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర స్థితి తెలంగాణలో చూస్తున్నామని’ కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.