అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : శైవ క్షేత్రాల్లో శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున కార్తికదీపాలు వెలిగించారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రదోషకాలం పూజ అనంతరం రాత్రి 7.30 గంటలకు జ్వాలాతోరణం, నిషి పూజ, రాత్రి 10.15 గంటలకు స్వామివారికి మహాపూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదగిరి గుట్ట లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఎనిమిది బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కార్తిక దీపం ఆరాధన పేరుతో కొండపైన మూడు చోట్ల, కొండ కింద రెండు చోట్ల భక్తుల కోసం కార్తిక దీపాలు వెలిగించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. కొండపైన శివాలయానికి భక్తులు పొటెత్తారు. చెర్వు గట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. కర్మన్‌ ఘాట్‌ ధ్యానంజనేయ స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పూజలు చేశారు. అంజనేయ స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నానని తెలిపారు.