అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టవద్దని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మాక్లూర్ మండలం మాణిక్ భండార్‌లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఇప్పటివరకు కేంద్రానికి వచ్చిన ధాన్యం, తూకం వేసిన బస్తాల వివరాలను తెలుసుకున్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, కేటాయించిన మిల్లులకు వెనువెంటనే ధాన్యం పంపాలని ఆదేశించారు. కాంటాలు పూర్తయిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి డబ్బులు జమ అయ్యేలా చూడాలని సూచించారు. యాసంగి సీజన్లో నీటి వసతి ఆధారంగా పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. మెప్మా పీడీ రాజేందర్, కేంద్రం నిర్వాహకులు, రైతులు ఉన్నారు.