అక్షరటుడే, వెబ్ డెస్క్: కోలీవుడ్ తారలు నయనతార, ధనుష్ మధ్య రాజుకున్న చిచ్చు చిలికి చిలికి గాలివానగా మారి తారాస్థాయికి చేరింది. వెండితెరపై నీతి వాఖ్యలు వల్లించే వీరు.. వ్యక్తిగత జీవితంలో సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు గుప్పించుకుంటూ రచ్చకెక్కడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ధనుష్ ను విమర్శిస్తూ నయనతార శనివారం బహిరంగ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తన లైఫ్, కెరియర్ కు సంబంధించిన డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు ధనుష్ ప్రయత్నిస్తున్నారని, రెండేళ్లుగా ఏసీసీ ఇవ్వడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. ధనుష్ పాతాళానికి దిగజారాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నయన్ భర్త విఘ్నేష్ శివన్ సైతం తీవ్రంగా స్పందించారు. ‘ద్వేషాన్ని కాదు.. ప్రేమని అందించండి.. మీ అభిమానుల కోసమైనా మారండి.. ‘ అంటూ పోస్టు చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఆ తర్వాత తొలగించారు.
గొడవ ఎప్పుడు మొదలైందంటే..
పదేళ్ల కిందట ధనుష్ నిర్మాతగా నయనతార ‘నేనూ రౌడీనే’ సినిమా చేశారు. దానికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఆ సమయంలోనే నయన్-విఘ్నేష్ ప్రేమించుకున్నారు. ఇది ధనుష్ కు నచ్చలేదు. ‘వీళ్లు ప్రేమించుకోవడానికి నేను డబ్బులు పెట్టి సినిమా తీయాలా?’ అనేది ధనుష్ వాదన. అప్పటికే బడ్జెట్ చేయిదాటిపోవడంతో ధనుష్ వీరిపై కోపంగా ఉన్నారు.
డాక్యుమెంటరీ చిత్రీకరణతో..
నయనతార – విఘ్నేష్ శివన్ 2022లో పెళ్లి చేసుకున్నారు. నయన్ కెరియర్, ప్రేమ, పెళ్లిపై నెట్ ఫ్లిక్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో డాక్యుమెంటరీ సిద్ధం చేసింది. ఇందులో ‘నేనూ రౌడీనే’ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలును తన అనుమతి లేకుండా వాడుకున్నారనేది ధనుష్ వాదన. ఇటీవల డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల కాగా.. అందులో సినిమాకు సంబంధించిన మూడు సెకన్ల ఫుటేజీ వాడుకోవడం చూసి ధనుష్ లీగల్ నోటీసు పంపించారు. నష్టపరిహారం కింద రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. వివాదానికి కారణమైన వీడియో క్లిప్పును విఘ్నేశ్ శివన్ ఇంస్టా స్టోరీస్ లో షేర్ చేశారు. ‘ఈ క్లిప్ కోసమే రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. మీరు దీనిని ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు’ అని రాసుకొచ్చారు.