అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిందని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా సీఎం బుధవారం మాట్లాడారు. తనపై అప్పట్లో బాంబు దాడి చేస్తే తిరుమల వేంకటేశ్వరస్వామి పునర్జన్మ ప్రసాదించి ప్రాణ భిక్ష పెట్టారన్నారు. ఈ సభలోనే నా కుటుంబ సభ్యులను అమమాన పరిచేలా మాట్లాడారని, ఆ సమయంలో తీవ్ర మనోవేదన కలిగిందన్నారు. వేధింపులకు గురి చేసి చివరికి జైలుకు పంపారని పేర్కొన్నారు. ‘తాను ఏ తప్పు చేయలేదు, అను క్షణం ప్రజల కోసమే పని చేస్తా, ఇబ్బందులు పెట్టినప్పుడు మరింత మనోధైర్యంతో ముందుకెళ్లాను’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలు, గాడితప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వ అప్పులు, తప్పులు ఈ ప్రభుత్వానికి సవాలుగా మారాయన్నారు.