అక్షరటుడే, ఇందూరు: బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. పిల్లల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పిల్లల అక్రమ రవాణా, హింస, బాల కార్మికులుగా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి మాట్లాడుతూ.. అమ్మాయిలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం తరఫున అందించే ఫలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానంగా లైంగిక వేధింపులకు గురికాకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి షేక్ రసూల్ బీ, జిల్లా న్యాయసాధికారిక సంస్థ కార్యదర్శి పద్మావతి, డీసీపీ బసవా రెడ్డి, డీసీపీవో చైతన్యకుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాజేందర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.