అక్షరటుడే, ఇందూరు: కులగణన జరిగితేనే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కలుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం నగరంలోని మేరు భవన్ లో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల తర్వాత బీసీ కులగణన జరుగుతోందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బీసీలు ఎంతో రిజర్వేషన్లు అంతే రావాలని, ఇది సాధ్యం కావాలంటే కుల గణన జరగాల్సిందేనన్నారు. బీసీ బిడ్డ మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కావడంతోనే రాష్ట్రంలో సర్వే సాధ్యమైందన్నారు. 8 శాతం కూడా లేని అగ్రవర్ణాలు 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సాధించారని పేర్కొన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, కానీ బీసీలకు రాజ్యాంగ బద్ధ అధికారాలు లేకపోవడంతో అన్యాయం జరుగుతుందని తెలిపారు. బ్రిటిష్ కాలంలో జరిగిన కులగణనలో 54శాతం బీసీలు ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం 130 కులాలతో సుమారు 60 శాతం ఉంటామన్నారు. కార్యక్రమంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్, ఉద్యోగ సంఘం ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, బుస్సా ఆంజనేయులు, ప్రసాద్, రవీందర్, దేవేందర్, గంగా కిషన్, శంకర్, శ్రీలత, నారాయణరెడ్డి, హన్మాండ్లు, లక్ష్మణా చారి తదితరులు పాల్గొన్నారు.