అక్షరటుడే, బాన్సువాడ: బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి చెల్లించాలని బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రాములు డిమాండ్ చేశారు. తెలంగాణ శ్రామిక శక్తి, బహుళ జన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో బీడీ కార్మికులతో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవన భృతికి 2014 కట్ ఆఫ్ తేదీని తొలగించి రూ. 4,016 చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, సయ్యద్, గంగాధర్, అనూసుయ, కుర్తి లింగం, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.