అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున న్యాయవాది సోమవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే కవితను అరెస్టు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి తాజాగా అక్రమంగా అరెస్టు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. సోమవారం విచారణకు హాజరు కావాలని కవిత భర్త అనిల్ తో పాటు మరో ముగ్గురికి ఈడీ శనివారమే నోటీసులు ఇచ్చింది.