అక్షరటుడే, వెబ్డెస్క్: త్రిలింగ దేశ చరితం తెలంగాణం.. జాతి మూలాలను.. గొప్పతనాన్ని.. వీరోచిత పరాక్రమ వైభవాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.. తాజాగా విడుదలైన కేశవ చంద్ర రమావత్(కేసీఆర్) చిత్రంలో.. గోరటి వెంకన్న చేతి నుంచి జాలువారిన పాట. ‘పద గతులు.. స్వర జతులు పల్లవించిన నేల’.. వింటుంటే తెలంగాణ ప్రజల హృదయం ఉప్పొంగి పరవశించిపోతోంది. ఈ చిత్రం ప్రారంభమే ఈ పాటతో మొదలై ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసి కట్టిపడేస్తుంది. మలిదశ నాటి ఉద్యమ సమయంలో కవులు, కళాకారులు ఆవిష్కరించిన తెలంగాణ చరిత గానామృతాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఈ పాట ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులకు మన చరితను మరోసారి అవలోకనం చేస్తుంది.
చిత్రం ఎలా ఉందంటే..
తారాగణం: రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్, లోహిత్, మైమ్ మధు, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, ధనరాజ్, జోర్దార్ సుజాత తదితరులు, సంగీతం: చరణ్అర్జున్, నిర్మాణ సంస్థ: గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, నిర్మాత: రాకింగ్ రాకేష్, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: గరుడవేగ అంజి
కథనం:
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రంగబాయి తండాకు చెందిన యువకుడు కేశవచంద్ర రమావత్(కేసీఆర్). చిన్నతనంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ ప్రసంగాలు విని ఆయనపై అభిమానం పెంచుకుంటాడు. స్థానికంగా అందరూ అతన్ని చోటా కేసీఆర్ అని పిలుస్తుంటారు. అదే ఊరిలో ఉండే మరదలు మంజు (అనన్య కృష్ణన్) కేశవ చంద్ర రమావత్ను ప్రేమిస్తుంటుంది. అయితే పట్నం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుందనే స్నేహితుల మాటల ప్రభావంతో మంజును పెళ్లాడడానికి నిరాకరిస్తాడు కేశవ. తండాలో ఉండే ఆసామి కూతురుతో కేశవ చంద్ర సంబంధం కుదుర్చుకుంటాడు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తాను పెళ్లి చేసుకుంటానని కేశవ హైదరాబాద్కు చేరుకుంటాడు. అక్కడ అతనికి ఎదురైన సమస్యలు సవాళ్లు ఏంటి ? చివరికి పెళ్లి ఎవరితో జరిగింది.. ఎలా జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.