అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు, మణిపూర్‌ హింసలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు ముందుగానే నిర్ణయం తీసుకున్నాయి. దీనిలో భాగంగానే అదానీ అంశంపై జేపీసీ(జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ) వేయాలంటూ కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. భారత్‌లోని అదానీ గ్రూప్‌ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణపై చర్చలు జరపాలని లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకు లోకసభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్షాల రగడ కొనసాగడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ అంతే..

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై చర్చ జరగాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. శాంతియుతంగా చర్చలు కొనసాగించాలని ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రతిపక్షాలను కోరారు. అదానీపై చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభను సైతం బుధవారానికి వాయిదా వేశారు.