అక్షరటుడే, ఇందూరు: భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం నుంచే ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత రెండు రోజులుగా జిల్లాలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. గురువారం పగటి ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలుగా నమోదైంది. దీంతో ఎండ వేడిమికి ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంటి నుంచి బయట అడుగుపెడుతున్నారు. ఇంట్లో ఉన్నా ఫ్యాన్లతో ఉపశమనం కలగకపోవడంతో కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.