అక్షరటుడే, జుక్కల్: ఆర్టీసీ బస్సులు సమయానికి రాక నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వడ్డేపల్లి, మల్లూరు, జక్కాపూర్ గ్రామాల విద్యార్థులు నిజాంసాగర్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటుండగా.. నిత్యం ఆర్టీసీ బస్సులో వస్తుంటారు. కాగా.. ప్రతిరోజు సాయంత్రం ఆయా గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఆలస్యంగా వస్తుండడంతో విద్యార్థులు రాత్రి ఎనిమిదింటికిగాని ఇళ్లకు చేరడం లేదు. దీంతో బడిలో ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్‌ను ఇలా బస్టాండ్ వద్దే చేసుకుంటున్నారు. ఒక్కోసారి బస్సు సకాలంలో రాకపోవడంతో చలిలోనే, ఆకలితో నిరీక్షిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి పాఠశాల వేళల్లో బస్సులు నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.