అక్షరటుడే, నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వందేళ్ల చరిత్ర ఉందని, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు, గోల్ బంగ్లా, జల విద్యుత్ కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు విస్తీర్ణం, ఆయకట్టు వివరాలు, జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరిగే తీరును తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రాజెక్టును టూరిజం స్పాట్‌గా ఏర్పాటు చేసేందుకు ఇటీవల భూమి సైతం కేటాయించిన విషయం గుర్తు చేశారు. పర్యాటక అభివృద్ధి కోసం కావాల్సిన నిధుల గురించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తహశీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి ఉన్నారు.