అక్షరటుడే, వెబ్ డెస్క్: కాలం చెల్లిన ఇంజక్షన్ ఇవ్వడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులకు బాధిత కుటుంబీకులు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ధర్పల్లి మండలానికి చెందిన 10 నెలల బాలుడు గత నెలలో అస్వస్థతకు గురి కాగా.. ఖలీల్వాడిలోని ఓ చిన్న పిల్లల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయిదు రోజులు వైద్యం తర్వాత బాలుడి ఆరోగ్యం మెరుగైంది. తీరా డిశ్చార్జి చేసే సమయంలో మిడజోలం 10 ఎంజీ ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత బాలుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించాలని సదరు ఆస్పత్రి వైద్యుడు సూచించాడు. హైదరాబాద్ కు తరలించే సమయంలో బాలుడు మృతి చెందాడు. తీరా.. కుటుంబీకులకు అనుమానం వచ్చి ఇంజక్షన్ గురించి ఆరా తీయగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గడువు ముగిసినట్లు గుర్తించారు. అనంతరం ఈ విషయమై కలెక్టరేట్ తో పాటు ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించేందుకు ఒకటో టౌన్ పోలీసులు నిరాకరించారు. మరోవైపు ఈ విషయాన్ని గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం తమకు తప్పుడు బిల్లుల వివరాలు ఇచ్చిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్పందించి పూర్తి విచారణ జరపాల్సిన అవసరముంది.