Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు మరొక వ్యక్తి కూడా సూసైడ్ కు పాల్పడినట్టుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు ఎస్సై సాయికుమార్ బుధవారం మధ్యాహ్నం స్టేషన్ నుంచి వెళ్లాడు. సాయంత్రం నుంచి ఆయన ఫోన్ పనిచేయడం లేదు. అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రుతి ఫోన్ కూడా పనిచేయ లేదు. ఎస్సై సహా కానిస్టేబుల్ ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో పోలీసులు ట్రేస్ చేయగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్టుగా గుర్తించారు. రాత్రి పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్ద ఎస్సై కారు, చెప్పులు, కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి. అయితే ఈ ఇద్దరితో పాటు బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సై, మహిళా కానిస్టేబుల్, సొసైటీ ఆపరేటర్ ముగ్గురు చెరువులో దూకిన ఘటన సంచలంగా మారింది. చెరువు వద్దకు జిల్లా ఎస్పీ సింధూశర్మ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం సదాశివనగర్, భిక్కనూరు, కామారెడ్డి పట్టణ సీఐలు, ఎస్సైలు, పోలీసుల బృందం చెరువు వద్ద ఉండి బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. చెరువు పరిధి పెద్దగా, లోతుగా ఉండడంతో పాటు చీకటి కావడంతో గాలింపునకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Advertisement