అక్షరటుడే, నిజామాబాద్: 2019 లోక్‌సభ ఎన్నికలు..! అప్పట్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నిక ఓ చరిత్ర. పసుపు బోర్డు సాధన కోసం 178 మంది రైతులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలతో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తీరా ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ, అప్పటి సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించి ఎంపీ అర్వింద్ విజయం సాధించారు. అయితే ఆయన ఎన్నికలకు ముందు పసుపు బోర్డు ఏర్పాటుపై ‘బాండ్‌పేపర్’ హామీ ఇచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని మోదీతో నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయించారు. బోర్డు ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే సమయంలో పసుపునకు డిమాండ్ పెరగడం, జిల్లా రైతులకు రికార్డు స్థాయిలో ధర దక్కడంతో నేడు అదే రైతులు బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్‌కు మద్దతుగా నిలిచారు. పైగా నామినేషన్ ఖర్చులను సైతం రైతులే భరించడం విశేషం. ఇటీవల పసుపు ధర క్వింటాకు రూ.20 వేలకు పైగా పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.!