అక్షరటుడే, బాన్సువాడ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలన్ని కల్పించి ప్రతి గింజ కొనుగోలు చేయాల్సి ఉండగా.. బీర్కూర్ సహకార సంఘం అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజులుగా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదు. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం స్థానిక నాయకులు బసవరాజ్, చందుతో కలిసి రైతులు సహకార సంఘం అధికారులను నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లు ఎందుకు నిలిపివేశారంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీర్కూర్ సొసైటీ కార్యదర్శిపై రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారులతో కుమ్మకై ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు నిర్వహించడం లేదని మండిపడ్డారు. వర్షం కురుస్తుందనే భయంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు దాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుంటే సహకార సంఘాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు.