అక్షరటుడే, బోధన్: నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించేది కాంగ్రెస్ పార్టీయేనని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎడపల్లిలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు ప్రజలు పదేళ్ల పాటు అధికారం ఇస్తే.. రాష్ట్రానికి మేలు చేయకుండా దోచుకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో పెట్టుబడులు, కూలీల ధరలు, భూముల ధరలు ఆకాశాన్నంటాయ న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరి పంటకు ఎకరాకు రూ.500 బోనస్ అందజేస్తామని తెలిపారు. 2009లో యూపీఏ హయాంలోనే రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. గల్ఫ్ వలస కార్మికులను ఆదుకుంటామని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు కటాఫ్ డేట్ లేకుండా పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు. తనను గెలిపిస్తే లోక్‌సభలో ప్రజా గొంతుకగా నిలుస్తానన్నారు. కాంగ్రెస్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.