అక్షరటుడే, ఇందూరు: గల్ఫ్ వలసలకు కాంగ్రెస్సే కారణమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో స్థానికంగా ఉపాధి, ఉద్యోగాలు కల్పించలేకపోవడంతోనే తెలంగాణవాసులు గల్ఫ్ బాట పట్టారని ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో యూఏఈ ఇండియన్ పీపుల్స్ ఫోరం ప్రతినిధి జితేందర్ వైద్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేస్తామనడం సిగ్గుచేటన్నారు. ఇన్నేళ్లుగా ఏర్పాటు చేయని బోర్డు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అవలంబించిన విధానాలతోనే ఉపాధి కరువై ఎంతో మంది తమ కుటుంబాలను పోషించుకునేందుకు తెలంగాణవాసులు గల్ఫ్ బాట పట్టారన్నారు. అనంతరం జితేందర్ వైద్య మాట్లాడుతూ యూఏఈలో స్థిరపడిన తెలంగాణ వాసులకు అండగా నిలుస్తామన్నారు. తమ ఫోరం సేవా కార్యక్రమాల్లో ముందుంటుందన్నారు. సంస్థలోని 24 మంది వైద్యులు గల్ఫ్ లో ఉండేవారికి హెల్త్ పరంగా ఎటువంటి ఆపదొచ్చినా సిద్ధంగా ఉంటారన్నారు. అలాగే లీగల్ ఇబ్బందులు ఎదురైతే తమ న్యాయవాదులు కూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. బీజేపీ అనుబంధ సంస్థగా తాము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కోవిడ్, వరదల సమయంలో తెలంగాణ వాసులను ఆదుకున్నామని గుర్తు చేశారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే వీలైనంత తొందరగా స్వదేశానికి రప్పించడంలో తమ సంస్థ పనిచేస్తుందన్నారు. అంతకుముందు బోధన్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.