అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మోదీ నాయకత్వంలో భవిష్యత్తు అంతా భారత్‌దేనని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే యువత అభివృద్ధి కోసం స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. దేశంలో కాంగ్రెస్‌ పాలనలో మూడు వందల స్టార్టప్‌లు ఉంటే.. బీజేపీ పాలనలో వీటి సంఖ్య లక్షకుపైగా ఉందన్నారు. దేశం గ్లోబల్‌ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. యువత స్టార్టప్‌లు స్థాపించి తాము ఎదగడంతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. ప్రధాని మోదీ పాలనలో దేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. భవిష్యత్తులో మూడో స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలనలో నేషనల్‌ హైవేలు, ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులు, ఐఐఎంలు, ఐఐటీలు, హాస్పిటళ్లు మూడింతలు పెరిగాయని వివరించారు. ప్రపంచ నేతలు మోదీని ఎంతో ప్రశంసిస్తున్నారన్నారు. ధర్మ రక్షణ, దేశభద్రత మోదీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పాలనలో బాంబు దాడులు జరిగేవని విమర్శించారు. బీజేపీ పాలనలో అలాంటి దాడులు జరగడంలేదన్నారు. ఒకసారి పుల్వామాపై దాడిచేస్తే పాక్‌లో ఎయిర్‌ స్ట్రైక్స్‌ చేశామన్నారు. కాంగ్రెస్‌ ముస్లిం ఓట్ల కోసం హిందువులకు ఎంతో అన్యాయం చేసిందని వ్యాఖ్యానించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమలవుతుందని చెప్పారు. తొలిసారి ఓటు వేసే యువత అబ్‌కీ బార్‌ జై శ్రీరాం అంటూ.. మొదటి ఓటును రాముడి పేరిట వేయాలని కోరారు. యువత తాము ఓటు వేయడంతో పాటు మరికొంత మందితో వేయించాలన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఐపీఎఫ్ ప్రతినిధి జితేందర్ వైద్య, బీజేవైఎం నాయకులు రాజశేఖర్ రెడ్డి, బంటు రాము, రణదీష్, తదితరులు పాల్గొన్నారు.