అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీసు అధికారుల తీరు వివాదాస్ప దమవుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించడంతో పాటు అవినీతికి పాల్పడుతున్నారు. ఈ మధ్యనే ఒకరిద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నప్పటికీ.. మిగతావారిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ప్రత్యేకించి కమిషనరేట్‌కు సీపీ లేకపోవడంతో పలువు రు సీఐలు, ఎస్సైలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. దీంతో గీత దాటిన వారిపై కఠినచర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
భీమ్‌గల్ సీఐ నవీన్, ఎస్సై మహేశ్‌పై ఇటీవల పలు ఆరోపణ లు వచ్చిన విషయం తెలిసిందే. తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నట్లు ఓ యువకుడు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అంతకు ముందు సైతం సీఐ, ఎస్సైపె అవినీతి ఆరోపణలు బయటకు వచ్చాయి. కాగా.. వీటన్నింటిపై స్పెషల్‌బ్రాం చ్‌తో విచారణ జరిపించిన ఉన్నతాధికారు లు సీఐ నవీన్‌పై బదిలీ వేటు వేశారు. అనంతరం సర్కిల్ బాధ్యతల నుంచి త ప్పించి హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేశారు. పూర్తి విచారణ అనంతరం కఠినచర్య లు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. అలాగే ఎస్సై మహేశ్‌పై కూడా చర్యలు ఉంటాయని సమాచారం.
ఇందల్వాయి ఎస్సైపై విచారణ..
డిచ్‌పల్లి సర్కిల్ పరిధిలోని ఇందల్వాయి స్టేషన్ ఎస్సై మనోజ్‌పై విచారణ కొనసాగుతోంది. స్టేషన్ పరిధిలో ఎస్సై మనోజ్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇందల్వాయికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాజాగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేకించి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ విచారణ చేపట్టారు. ఇటీవల ఫిర్యాదుదారులను పిలిపించి మాట్లాడిన ఆయన..వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అలాగే డిచ్‌పల్లి సీఐని సైతం పిలిపించి వివరాలు ఆరా తీశారు. సర్కిల్ పరిధిలో ఇంత జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సీఐని సైతం మందలించినట్లు సమాచారం. కాగా విచారణ అనంతరం ఇందల్వాయి ఎస్సైపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీస్ బాస్ లేకపోవడంతో..
నిజామాబాద్ సీపీగా కల్మేశ్వర్ ఉన్న సమయంలో కిందిస్థాయి హోంగార్డు నుంచి ఏసీపీ వరకు అందరూ సవ్యంగా పని చేశారు. ఆయన భయంతో ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. పలువురిపై ఫిర్యాదులు రాగా వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆయన అక్టోబర్ 18న బదిలీ కాగా కొత్త కమిషనర్‌ను నియమించలేదు. దీంతో కమిషనరేట్‌లోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఎవరికి వారే అన్నతీరుగా వ్యవహరిస్తున్నారు. అందుకు వరుస ఘటనే నిదర్శనంగా నిలుస్తున్నాయి.