అక్షరటుడే, ఇందూరు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే వృథానేనని మాజీ గవర్నర్ తమిలి సై సౌందర్ రాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ రావాల్సిందేనని, మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిందేనన్నారు. అలాగే నిజామాబాద్ అభివృద్ధి చెందాలన్నా మళ్ళీ ఎంపీగా అరవింద్ ధర్మపురిని గెలిపించాలని కోరారు. దేశంలో ఇప్పటికే పేదరిక నిర్మూలన జరిగిందని గుర్తు చేశారు. రైతు మిత్రుడు, పసుపు బోర్డు కోసం పోరాడిన వ్యక్తి అరవింద్ ధర్మపురి అని కొనియాడారు. అవినీతి చేసిన మాజీ ఎంపీ కవిత ప్రస్తుతం జైల్లో ఉన్నారని, అందుకే అవినీతికి దూరంగా ఉండే అరవింద్ ను గెలిపించుకోవాలన్నారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పల్లె గంగారెడ్డి, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.