అక్షరటుడే, ఆర్మూర్‌: బిడ్డకు జన్మనిచ్చి కొద్దిసేపటికే బాలింత మృతి చెందిన ఘటన ఆర్మూర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్‌ మండలం కల్లెడకు చెందిన సుమలత(25) మూడో కాన్పు నిమిత్తం గురువారం రాత్రి ఆర్మూర్‌లోని తిరుమల ఆస్పత్రిలో చేరింది. కాగా రాత్రి రెండు గంటల సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం సుమలత బిడ్డను సైతం చూసుకుంది. అయితే కొద్దిసేపటి తర్వాత కుట్ల వద్ద నొప్పిగా ఉందని వైద్యులకు చెప్పడంతో ఇంజక్షన్‌ ఇవ్వగా.. కాసేపటికే సుమలత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సుమలత మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఐఎంఏ సభ్యులు ఆస్పత్రికి రాగా వారిని సైతం అడ్డుకున్నారు. ఆర్మూర్‌ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ రవికుమార్‌, ఎస్సై అంజమ్మ సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకుని బాధితులను సముదాయించే ప్రయత్నం చేశారు.