అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26 ను లోక్ సభలో ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్ లో రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేశారు.

Advertisement

రక్షణ రంగం: రూ.4.91 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సాయుధ దళాలను బలోపేతం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రక్షణ కేటాయింపులును 7.6 శాతం పెంచింది. 2025 కేంద్ర బడ్జెట్‌లో తదుపరి ఆర్థిక సంవత్సరానికి రూ.4.91 లక్షల కోట్లు కేటాయించింది. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భరత’ పై దృష్టి సారించి ఈ కేటాయింపులు చేసింది.

గ్రామీణాభివృద్ధి : రూ. 2.66 లక్షల కోట్లు

రక్షణ రంగం తర్వాత బడ్జెట్ లో కేంద్రం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. గ్రామీణాభివృద్ధికి ₹2.66 లక్షల కోట్లు కేటాయించింది. పల్లెల్లో తయారీ, వస్తు సేవల మద్దతు, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాధాన్యం సహా గ్రామీణాభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నారు.

హోమ్ శాఖ : రూ.2.33 లక్షల కోట్లు

దేశ అంతర్గత భద్రతకు బడ్జెట్ లో మూడో ప్రాధాన్యం ఇచ్చింది. ఈమేరకు హోమ్ శాఖకు కేంద్రం రూ.2.33 లక్షల కోట్లు కేటాయించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వివిధ సంస్థల ద్వారా అంతర్గత భద్రతను పర్యవేక్షిస్తుంది. భద్రత, శాంతి, సామరస్యాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మానవశక్తి, ఆర్థిక సహాయం, మార్గదర్శకత్వం, నైపుణ్యాన్ని అందిస్తుంది.

వ్యవసాయం & అనుబంధ కార్యకలాపాలు : రూ . 1.71 కోట్లు

వ్యవసాయం & అనుబంధ కార్యకలాపాలకు కేంద్ర సర్కారు బడ్జెట్లో రూ . 1.71 కోట్లు కేటాయించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు 15% పెరుగుదలగా చెప్పొచ్చు. దేశంలోని పల్లెలు వ్యవసాయ ఆధారపడి ఉన్నాయి. అందుకే ఈ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి, వాతావరణాన్ని తట్టుకునే రకాల వంగడాలను అభివృద్ధి చేయడానికి, వ్యవసాయ పరిశోధన వ్యవస్థను మెరుగుపరిచేందుకు వీటిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

వ్యవసాయ రంగం భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం కావడంతో గ్రామీణ ఆదాయాలను పెంచడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వ్యవసాయంపై ఖర్చును పెంచుతోంది. వ్యవసాయ రంగం ఇటీవలి కాలంలో క్రమంగా వృద్ధి చెందింది. 2017 నుంచి 2023 వరకు ఏటా సగటున 5% వృద్ధి ఉంది.

విద్య : రూ. 1.28 లక్షల కోట్లు

2025-26 కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు ₹1,370 కోట్లు అదనంగా పొందాయి. ఐఐఎంల బడ్జెట్‌లో కేంద్రం 50% కోత విధించింది. పాఠశాల విద్యలో డిజిటల్ సౌకర్యాలు, మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మార్పులు విద్యారంగంలో భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.

వైద్యం : రూ. 98,311 కోట్లు

దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం, నిర్వహించడం, మెరుగుపరచడం కోసం వైద్య రంగానికి కేంద్ర ప్రభుత్వం ₹99,858.56 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోల్చితే ఇది 9.78% పెరుగుదల. ఔషధ పరిశ్రమకు PLI కోసం ₹2,445 కోట్లు కూడా కేటాయించింది.

పట్టణాభివృద్ధి : రూ. 96,777 కోట్లు

‘నగరాలను వృద్ధి కేంద్రాలుగా’ అభివృద్ధి చేయడం, ‘సృజనాత్మకంగా నగర పునర్నిర్మాణం’, ‘నీరు, పారిశుద్ధ్యం’కు సంబంధించిన ప్రాజెక్టుల అమలుకు రూ. 96,777 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిధిని జులై బడ్జెట్‌లో ప్రకటించిన ప్రతిపాదనల అమలుకు వినియోగిస్తారు.

ఐటీ & టెలికాం : రూ. 95,298 కోట్లు

సమాచార సాంకేతికత (IT), టెలికమ్యూనికేషన్స్ రంగాలకు రూ. 95,298 కోట్లు ప్రతిపాదించింది. టెలికం ప్రాజెక్టులు, BSNLను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుంది. భారత్‌నెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించనుంది. సాంకేతిక విద్య కోసం రూ. 500 కోట్లతో AI కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. AI, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, రోబోటిక్స్‌లో పరిశోధన కోసం PM ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా 5 ఏళ్లలో 10,000 ఫెలోషిప్‌లను అందించనుంది. AI, బ్లాక్‌చైన్, డీప్‌టెక్ స్టార్టప్‌లకు 5 ఏళ్ల దాకా పన్ను రాయితీలు కొనసాగుతాయి. స్టార్టప్‌ల కోసం ₹10,000 కోట్ల నిధిని కేటాయించనుంది. సెమీ‌కండక్టర్ తయారీ, చిప్ డిజైన్, AI ప్రాసెసర్ల అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఉంటాయి. క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లపై కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 10%కి తగ్గించనుంది.

విద్యుత్ : రూ. 81,174 కోట్లు

విద్యుత్ రంగానికి కేంద్రం రూ. 81,174 కోట్లు కేటాయించింది. ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా అందించడం, మారుమూల ప్రాంతాలకు విస్తరించడం ఈ కేటాయింపుల ప్రధాన ఉద్దేశం.

పరిశ్రమలు & వాణిజ్యం : రూ. 65,553 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 65,553 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ఉత్పత్తికి ప్రోత్సాహం, వ్యాపార వృద్ధి, కొత్త పెట్టుబడులు, మెరుగైన మౌలిక వసతులు, నూతన విధానాల అమలుకు వినియోగించనుంది. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరగడం, స్టార్టప్‌ల ప్రోత్సాహం, ఎగుమతులు మెరుగుపడడం, దేశీయ తయారీ రంగం అభివృద్ధి చెందడం వంటి ప్రయోజనాలు కలగనున్నాయి.

సామాజిక సంక్షేమం : రూ.60,052 కోట్లు

దీంతోపాటు సంక్షేమానికి రూ.60,052 కోట్లు, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి రూ. 55,679 కోట్లు, పునరుత్పాదక రంగాయానికి రూ. 35,460 కోట్లు కేటాయించడం గమనార్హం.

Advertisement