అక్షరటుడే, కామారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ సింధు శర్మతో కలిసి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో గతేడాది 550 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ప్రమాదాలకు గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా బ్లాక్‌ స్పాట్లను గుర్తించాలని సూచించారు. ప్రమాదం జరిగిన గంట సమయం గోల్డెన్‌ పీరియడ్‌ అని.. తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీ కాజల్‌, డీఎస్పీ నాగేశ్వర్‌ రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ రవిశంకర్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రామ్‌ సింగ్‌ పాల్గొన్నారు.