అక్షరటుడే, ఇందూరు: రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోదీ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌ రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి మత కల్లోలాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్‌లో ముస్లింలకు ఉన్న పది శాతం రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని మోదీ అనడం ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కులను హరించి వేసి కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసమే మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి లేదన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులను తప్పకుండా కాపాడి వారికి కావాల్సిన మౌలిక వసతులు హక్కులు కల్పించడమే తమ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు గడుగు గంగాధర్‌, రామర్థి గోపి, జావిద్‌ అక్రమ్‌, వేణు రాజ్‌, పంచరెడ్డి చరణ్‌ పాల్గొన్నారు.