Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: ప్రపంచంలో ఎవరికి ఏ వైద్య సహాయం కావాలన్నా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవాలన్న దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Chief Minister A. Revanth Reddy) చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా అవసరమైన వైద్య సహకారం అందించడానికి వీలుగా సమగ్ర హెల్త్ టూరిజం పాలసీ(Health Tourism Policy)ని తీసుకురానున్నట్టు తెలిపారు.

పద్మ విభూషణ్ అవార్డు(Padma Vibhushan Award) పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

వెయ్యి ఎకరాల్లో హెల్త్ క్యాంపస్‌(Health Campus)

‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల (International Standards)తో అన్ని రకాల సౌకర్యాలతో విమానాశ్రయానికి సమీపంలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఆ క్యాంపస్‌లో అన్ని రకాల స్పెషలైజేషన్స్, వైద్య సేవలు అందించడానికి ఆయా సంస్థలను భాగస్వామ్యం చేసుకునేందుకు వీలుగా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.’

ప్రపంచంలో 35 శాతం బల్క్ డ్రగ్ ఉత్పత్తి మన వద్దే

‘ఫార్మా(Pharma) రంగంలో ప్రపంచంలోనే 35 శాతం బల్క్ డ్రగ్(bulk drugs) తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతోంది. కొవిడ్ విపత్తు(Covid disaster) సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వ్యాక్సిన్ తెలంగాణ నుంచి సరఫరా అయింది. ఎవరికి ఏ వైద్య సహాయం కావాలన్నా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం రావాలి. ఆ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే పాలసీ రూపకల్పనలో డాక్టర్ నాగేశ్వరరెడ్డి సహకారం కావాలి.’

ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు(Digital health card)

‘రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి డేటా ప్రైవసీతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. తద్వారా ఒక వ్యక్తి హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు సదరు వ్యక్తి అంతకుముందు ఎలాంటి వైద్యం తీసుకున్నారు ? ఎలాంటి చికిత్సలు జరిగాయి ? ఎలాంటి మందులు వాడారన్న సమగ్రమైన సమాచారాన్ని డిజిటిల్ హెల్త్ కార్డులో నమోదవుతుంది.’

ఇది కూడా చ‌ద‌వండి :  Ration Cards : రేష‌న్ కార్డుల పంపిణీపై కీల‌క అప్‌డేట్.. స్మార్ట్ కార్డుల జారీకి సన్నాహాలు..!

మిడిల్ ఈస్ట్ దేశాల వారికి నేరుగా విమాన సర్వీసు

‘ఒకప్పుడు వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల(Middle East countries) నుంచి వచ్చే వారి కోసం హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసు(Direct flight service) ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. అలా వచ్చే వారి కోసం విడిగా కౌంటర్లు పెట్టి వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని అనుకుంటున్నాం.’

ఏడాదిలో రూ.900 కోట్ల సీఎంఆర్ఎఫ్ సాయం

‘పేదలకు ఉచిత వైద్యం అందించాలని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని రూ. పది లక్షలకు పెంచాం. గడిచిన ఏడాది కాలంలోనే నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్(CMRF) కింద రూ.900 కోట్లు అందించాం.’ అని సీఎం వివరించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎమ్మెల్యే గడ్డం వివేక్, డాక్టర్ పీఎస్ రెడ్డి, డాక్టర్ విష్ణు రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement