అక్షరటుడే, వెబ్‌డెస్క్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) లావాదేవీలు రికార్డులు సృష్టిస్తున్నాయి. జనవరిలో మొదటిసారిగా 16.99 బిలియన్లను దాటాయి. దీని మొత్తం విలువ రూ.23.48 లక్షల కోట్లకు పైగా ఉంటుందని తాజా ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది.
80 శాతం రిటైల్ లావాదేవీలే..
2023-24లో డిజిటల్ పేమెంట్స్ భారీ వృద్ధిని సాధించాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 80 శాతం రిటైల్ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. 2024 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.200 లక్షల కోట్లు దాటింది. భాగస్వామ్య బ్యాంకులు, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాంల నెట్‌వర్క్ పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు.
దేశంలో 80కి పైగా యూపీఐ యాప్‌లు
దేశంలో 80 కంటే ఎక్కువగా యూపీఐ యాప్‌లు ఉన్నాయి. ఇందులో బ్యాంకు యాప్‌లు, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు ఉన్నారు. FY24-25లో జనవరి వరకు పీపుల్ టు మర్చంట్ (P2M) లావాదేవీలు 62.35 శాతం, P2P లావాదేవీలు మొత్తం UPI వాల్యూమ్‌లో 37.65 శాతంగా ఉన్నాయి. తక్కువ విలువ కలిగిన చెల్లింపుల కోసం ప్రజలు ఎక్కువ ఆస్తకి చూపిస్తున్నారు. రూ.500లోపు చెల్లింపుల వాటా 86 శాతం ఉంటాయి. కాగా.. భారత్ లో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, క్రెడ్ ద్వారా లావాదేవీలు జరిపే వారు సింహభాగం ఉన్నారు.