Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: పార్టీలో ఉంటూ గీత దాటే వారికి కాంగ్రెస్​ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న(చింతపండు నవీన్​)ను సస్పెండ్​ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గీత దాటి మాట్లాడే ఇతర నేతలకు హెచ్చరికలు పంపినట్లైంది.

నేతల ఇష్టారాజ్యం

కాంగ్రెస్​ పార్టీలో కొందరు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పలు సందర్భాల్లో పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారు. కుల గణన విషయంలో సీఎం రేవంత్​రెడ్డికి కొందరు సహకరించలేదని సమాచారం. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను ఏ విషయంలో వ్యతిరేకించినా బీసీ కుల గణనపై సపోర్టు చేయాలని స్వయంగా కోరారు. దీనిని బట్టి పార్టీలో అంతర్గతంగా ఏం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పార్టీ లైన్​ దాటిన ఎమ్మెల్సీ మల్లన్నను సస్పెండ్​ చేసి ​మిగతా వారికి స్పష్టమైన సంకేతాలు పంపింది.

వర్గపోరుకు చెక్ పడేనా..

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. పార్టీ టికెట్​పై గెలిచిన ఎమ్మెల్సీనే సస్పెండ్​ చేయడంతో అలాంటి వారు నేతలంతా సైలెంట్​ అయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి :  MLA quota MLC | నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు

‘మీనాక్షి’ మార్క్​

కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహరాల ఇన్​ఛార్జిగా నియామకం అయ్యాక తొలిసారి హైదరాబాద్​ వచ్చిన మీనాక్షి నటరాజన్​ తన మార్క్​ చూపించారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, భిన్నాభిప్రాయాలు సహజమని చెప్పిన ఆమె.. పార్టీకి నష్టం కలిగించే వారిపై చర్యలుంటాయని స్పష్టం చేస్తూ తీన్మార్​ మల్లన్నపై వేటు వేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చిన ఆమె.. నష్టం చేసే వారిపై చర్యలకు వెనుకాడమని తేల్చి చెప్పారు.

రాహుల్​ గాంధీ ఆదేశాలతోనే..

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్​ మల్లన్నపై వేటు వేసినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇదొక హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఎవరైనా పార్టీలైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement