అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: వైద్యులు సమయపాలన పాటించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు(COLLECTOR RAJIV GANDHI HANUMANTHU) సిబ్బందిని ఆదేశించారు. సాలూర(SALURA) మండలకేంద్రంలోని పీహెచ్సీ(PHC)ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను గమనించారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఇటీవలి కాలంలో పీహెచ్‌సీని సందర్శించారా అని ఆరా తీశారు.
పీహెచ్సీలో అన్నిరకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కాగా, శిథిలావస్థకు చేరుకున్న పీహెచ్సీ పాత భవనాన్ని పరిశీలించిన జిల్లా పాలనాధికారి, కొత్త భవనం మంజూరు వివరాల గురించి ఆరా తీశారు. వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ తదతరులు ఉన్నారు.