అక్షరటుడే, వెబ్‌డెస్క్: AICC :రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరో వివాదం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత ఇంట్లో మున్నూరు కాపు సామాజిక వర్గ నేతలు భేటీ కావడం, అందులో ఆల్ పార్టీ నేతలు పాల్గొనడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వి హనుమంతరావు(వీహెచ్) ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశంపై పార్టీ నాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ బీజేపీ(bjp) , బీఆర్ఎస్(BRS) నాయకులు కూడా హాజరయ్యారు. మున్నూరు కాపు నేత, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas)కు మంత్రి పదవి ఇవ్వాలని ఈ భేటీలో తీర్మానం చేశారు.
AICC : మీనాక్షి నటరాజన్ ఆరా
సీనియర్ నేత ఇంట్లో ప్రతిపక్ష పార్టీల నాయకులతో మీటింగ్ పెట్టడంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో వీహెచ్‌తో పాటు, ఆది శ్రీనివాస్, సీనియర్ నేత కే కేశవరావు పాల్గొన్నారు. అయితే ఇందులో పలువురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా కులగణన విషయంలో పలు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. మీటింగ్ పెట్టి మరి పార్టీని, ప్రభుత్వాన్ని తిట్టించారని వీహెచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి, విమర్శలు చేస్తారా..? అని నిలదీసింది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని వీహెచ్ ను మీనాక్షి నటరాజన్ వివరణ కోరినట్లు సమాచారం.
AICC : బల ప్రదర్శనకు సిద్ధం
కులగణనతో తమ కులం వారి జనాభా తక్కువగా చూపించారని మున్నూరు కాపులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీహెచ్ ఇంట్లో సమావేశం నిర్వహించారు. తమ కులానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా తమ ఇతర డిమాండ్ల సాధన కోసం బల ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రి పదవి గురించి డిమాండ్ చేయడంపై కూడా అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
AICC : స్పందించిన వీహెచ్
మున్నూరు కాపు మీటింగ్‌పై ఏఐసీసీ సీరియస్ కావడంతో వీహెచ్ స్పందించారు. సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదన్నారు. బీసీ కులగణనకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా సహకరిస్తామని చెప్పారన్నారు. త్వరలో మున్నూరు కాపుల సభ పెడతామన్నారు. సీఎంను కలిసిన తర్వాత ఎప్పుడు పెడతామో చెబుతామని వీహెచ్ పేర్కొన్నారు. తాను పార్టీకి నష్టం కలిగించే వ్యక్తిని కాదని ఆయన అన్నారు.