అక్షరటుడే, కామారెడ్డి: LRS : ఎల్ఆర్ఎస్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు శివారులో గల 19వ వార్డులోని సర్వే నెంబర్ 525లో ప్లాట్లను మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల క్రమబద్ధీకరణ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు 25 శాతం రాయితీతో డబ్బులు చెల్లిస్తే సదరు ప్లాట్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో దరఖాస్తు చేసుకున్న అర్జీదారులు రాయితీ రుసుమును చెల్లించి క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, టీపీవో గిరిధర్, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.