అక్షరటుడే, ఇందూరు: NIZAMABAD | ఒంటరి మహిళల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత అన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ప్రతి గ్రామంలో 200 నుంచి 300 మంది ఒంటరి మహిళలు ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారన్నారు. అలాగే దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి 10వ తేదీన బహుజన శ్రామిక దినోత్సవం గా ప్రకటించాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా జనరల్ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, మహిళా టౌన్ ఎస్సై పుష్ప ప్రసంగించారు. సదస్సులో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా నాయకురాలు విమల, సదరన్ హోం సూపరింటెండెంట్ జ్యోత్న, ప్రమీల, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.