అక్షరటుడే, వెబ్‌డెస్క్: YSR CP | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయి. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తూ వణుకు పుట్టిస్తున్నారు. వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, వైసీపీ సానుభూతిపరుడు, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టులతో రాష్ట్రంలో వైసీపీకి చెందిన మిగతా నాయకులు వణికిపోతున్నారు. పోసాని అరెస్ట్‌పై ఇంకా చర్చ కొనసాగుతుండగానే మరోసారి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇటీవల సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దాంతో త్వరలోనే ఆయన అరెస్ట్ కూడా ఉంటుందని అందరు భావించారు.
YSR CP | రజినికి టెన్షన్..
ఇక ఏపీలో వరుస అరెస్ట్‌ల వేళ విడదల రజిని నెక్ట్స్ టార్గెట్ అనే టాక్ వినిపిస్తుంది. అధికారం అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి సర్కార్ ఆమెని జైలుకి పంపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విడదల రజిని చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగిస్తుండగా, కొన్ని అనుమతులు వస్తే ఆమెని అరెస్ట్ చేయడం ఖాయమని అంటున్నారు.
2019లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజిని.. కేబినేట్లో వైద్యారోగ్య శాఖా మంత్రిగా పనిచేశారు. ఇక 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు మారిపోయి.. అక్కడ ఘోర పరాజయాన్ని చవి చూసింది.
ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రజినీ భారీగా వసూళ్లు చేపట్టారనే ఆరోపణలున్నాయి. స్టోన్ క్రషర్ యజమానుల నుంచి.. ఏకంగా రూ.2 కోట్లకు పైగా వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపి అది నిజమే అని తేల్చారు. నివేదికని ప్రభుత్వానికి కూడా అందించారు. ఇక రజినిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతించాలని గవర్నర్‌కు ఏసీబీ లేఖ రాయగా, గవర్నర్ నుండి అనుమతి రాగానే ఆమెని అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఓవైపు ఓటమి.. మరోవైపు అవినీతి ఆరోపణలు రజనిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్ .