అక్షరటుడే, ఇందూరు: TRANSCO ALERT | ఇళ్లల్లో విద్యుత్ మీటర్లు తిరగకుండా చేసి కరెంట్ బిల్లు తగ్గిస్తామని చెబుతూ ఇళ్లల్లోకి వస్తున్నారని.. వారిని నమ్మవద్దని ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు.
ఇళ్లల్లోని మీటర్లలో రీడింగ్ తగ్గిస్తామని చెప్పి పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్ కో విజిలెన్స్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోసాలకు పాల్పడే వారు కొన్ని వైర్లను కట్ చేస్తారని, అది చట్టవిరుద్దమన్నారు. ఈ వ్యక్తులు కరెంట్ బిల్లు తగ్గిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తులు ఇళ్లకు వస్తే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
కాగా.. నిజామాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలువురు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలకు పాల్పడినా, ఎలాంటి వారికి సహకరించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.