అక్షరటుడే, వెబ్‌డెస్క్: Droupadi Murmu : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రైపది ముర్ము తన సందేశాన్ని అందించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. నారీ శక్తి సే వికసిత్ భారత్ అనే థీమ్‌తో ఈ జాతీయ సదస్సును న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ద్రౌపది ముర్ము భారతదేశ ప్రజలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సందేశాన్ని అందించారు. మహిళా సాధికారత వల్లనే భారతదేశం పురోగమిస్తుందని.. అదే భారతదేశ పురోగతికి వెన్నెముక అని కొనియాడారు.
Droupadi Murmu : నారీ శక్తిని సమర్ధంగా వినియోగించుకోవాలి
నారి శక్తిని సమర్ధంగా వినియోగించుకోవాలని, అప్పుడే భారతదేశం సమగ్ర అభివృద్ధిని సాధించగలదని ముర్ము అన్నారు. దేశ అభివృద్ధి కోసం మహిళలకు స్వేచ్ఛగా ఎదిగే వాతావరణాన్ని కల్పించాలన్నారు. మహిళలు ఎలాంటి ఒత్తిడి లేకుండా, సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా హక్కు కలిగి ఉండాలని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
అలాగే, మహిళలు అన్ని రంగాల్లో పురోగమించేలా వాళ్లకు అనుకూలమైన పరిస్థితులను కల్పించాలన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర పెరుగుతుందంటే దాని అర్ధం, దేశ పురోగతికి ఇంకా బలమైన పునాది పడినట్టేనని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.