అక్షర టుడే, ఇందూరు: Nizamabad | పసుపు రైతులు, వ్యాపారుల సమక్షంలో సమావేశం నిర్వహించి రైతుల విజ్ఞప్తి మేరకే సరైన మద్దతు ధర అందజేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి తెలిపారు. సోమవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మార్కెట్ యార్డుకు వచ్చిన సమయంలో తాను, సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఎంసీబీసీలో ధర లేకపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేరని, ఇంతలోనే రైతులు రాస్తారోకోకు వెళ్లారని పేర్కొన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, వ్యాపారుల సమక్షంలో పసుపు కాడి క్వింటాకు రూ.9,500, మరో రకం రూ.8 వేలకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రైతులు కూడా అంగీకరించారని చెప్పారు. రైతులను మోసగించే చర్యలను సహించేది లేదని పేర్కొన్నారు.