అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండలంలో గతేడాది జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన సోషల్ ఆడిట్ ముగిసింది. వారం రోజులుగా అన్ని గ్రామాల్లో ఆడిట్ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన 14వ విడత ప్రజావేదిక కార్యక్రమాన్ని బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఏపీడి వామన్ రావు, విజిలెన్స్ అధికారి ప్రశాంత్, ఎస్ఆర్పీ దేవేందర్, ఎంపీడీవో గంగాధర్ తో పాటు గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు హాజరయ్యారు. కాగా.. కూలీ డబ్బుల కంటే అదనంగా చెల్లింపులు, కొలతలు సక్రమంగా లేని పనులు, బినామీ కూలీలను గుర్తించి ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. మాగి గ్రామంలో జేసీబీతో పనులు చేయించి కూలీలతో చేయించినట్లు మాస్టర్లు తయారు చేశారంటూ గ్రామానికి చెందిన సుదర్శన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే గత వారం రోజులుగా సోషల్ ఆడిట్ కోసం రూ.1,37,000 ఖర్చు చేసి.. కేవలం కొద్ది మొత్తంలో అవినీతిని బహిర్గతం చేయడం గమనార్హం.