అక్షరటుడే, ఎల్లారెడ్డి : Liquor ban | ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే పచ్చని పల్లెల్లో మద్యం అగ్గి రాజేస్తోంది. సరదాతో మొదలై చివరకు యువత మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. చివరకు కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇదంతా నిన్నటి మాట… మనిషిలో మార్పు అవశ్యమని నిరూపిస్తూ తమ పొలిమేరల్లో మద్యం వాసన కూడా రాకూడదని పలు పల్లెలు తీర్మానం చేస్తున్నాయి. మహాత్ముని బాటలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
Liquor ban | మెంగారంను ఆదర్శంగా తీసుకుని..
లింగంపేట మండలంలోని మెంగారం గ్రామం మండల కేంద్రానికి సమీపంలో ఉండడం, విచ్చలవిడి మద్యం విక్రయాలతో ఉదయం 6 నుంచే మద్యం తాగేందుకు వచ్చే జనాలతో గ్రామస్థులు ఇబ్బంది పడేవారు. అంతేగాక, గ్రామంలోని యువత, పెద్దలు కూడా మద్యానికి బానిసగా మారుతుండడంతో, గమనించిన గ్రామస్థులు గతేడాది మద్యపానం నిషేధానికి తీర్మానం చేసుకున్నారు. ఆధ్యాత్మిక చింతనతో అందరూ ఏకతాటిపై ఉండి గ్రామంలో మద్యపాన నిషేధానికి నిర్ణయించుకున్నారు. గ్రామంలోని బెల్ట్‌షాపులను మూసివేయించారు. ఇలా మెంగారంను ఆదర్శంగా తీసుకుని ఆరునెలల కాలంలో ఎనిమిది గ్రామాల్లో మద్యపాన నిషేధానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీర్మానాలు చేసుకున్నారు. మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు.
Liquor ban | పది గ్రామాలు దూరం..
మెంగారంను ఆదర్శంగా తీసుకుని పరమల్ల, సజ్జనపల్లి, ఎక్కపల్లి, శెట్పల్లి సంగారెడ్డి, పోతాయిపల్లి, కోమట్‌పల్లి, కేశ్‌పేట, అన్నారెడ్డిపల్లి గ్రామాల్లో మద్యం విక్రయాలు నిషేధిస్తూ తీర్మానాలు చేశారు. దీంతో లింగంపేట మండలం మద్యపాన నిషేధం పైపు అడుగులు వేస్తోంది.
మద్యం మత్తులోనే ప్రమాదాలు..
– శ్రీనివాసులు, డీఎస్పీ, ఎల్లారెడ్డి
యువత మద్యం మత్తులో వాహనాలు నడిపి ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. మద్యానికి బానిసై ఎంతోమంది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గ్రామస్థులు స్వచ్ఛంద మద్య నిషేధానికి ముందుకు రావడం అభినందనీయం.