అక్షరటుడే, హైదరాబాద్: Telangana University : తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు అంశం జిల్లాలో తీవ్ర చర్చకు తెరలేపింది. వర్సిటీ పేరు మార్పు విషయంలో నివేదిక ఇవ్వాలంటూ మూడు రోజుల క్రితం ఓ లేఖ రావడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. తెలంగాణ పేరు మారిస్తే ఊరుకునేది లేదంటూ ఆందోళనకు దిగాయి. కాగా.. సమాజ సేవకురాలు, దళిత సంక్షేమకర్త జెట్టి ఈశ్వరీబాయి స్మారకంగా తెలంగాణ యూనివర్సిటీని ఈశ్వరీబాయి విశ్వవిద్యాలయంగా పేరు మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Telangana University : విద్యార్థి సంఘాల నిరసనలు
తెలంగాణ నినాదానికి, అస్తిత్వానికి నిదర్శనంగా కీర్తించబడుతున్న తెలంగాణ విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు సైతం వర్సిటీ పేరును మారిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నాయి. యూనివర్సిటీలో పలు విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి.
Telangana University : రిజిస్ట్రార్‌కు లేఖ రావడంతో..
తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఈ నెల 10న తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు ఒక లేఖ వచ్చింది. వర్సిటీ పేరును జే.ఈశ్వరీబాయి విశ్వవిద్యాలయంగా పేరు మార్చే విషయంలో నివేదిక ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Telangana University : త్యాగాల పునాదులపై..
ఎన్నో ఉద్యమాలు, మరెన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఉన్నఫలంగా దీని పేరును మారుస్తామంటూ ప్రతిపాదించడం తెలంగాణ ప్రజల మనోభావాలను, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారులను అవమానించడమే అవుతుందని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్సిటీ పేరు మార్పు జరగనివ్వబోమని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తుతామని వర్సిటీ విద్యార్థులు సర్కారును హెచ్చరిస్తున్నారు.
Telangana University : ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో..
పేరు మార్పు అంశంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఆయన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమె వెంటనే కళాశాల విద్య కమిషనర్ దేవసేనతో చర్చించి సమాచారం. వారు తెయూ రిజిస్ట్రార్‌తో మాట్లాడి ఈ అంశానికి ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టాలని.. లేఖపై స్పందించాల్సిన అవసరం లేదని మౌఖికంగా చెప్పినట్లు సమాచారం.
Telangana University : ఎవరీ ఈశ్వరీబాయి..?
అసలు ఈశ్వరీబాయి ఎవరు? ఆమెతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధం ఏంటో ఓసారి పరిశీలిస్తే..
- పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో సామాజిక సేవారంగంలో గణనీయమైన కృషి సల్పినవారిలో జెట్టి ఈశ్వరీబాయి ఒకరు.
- డిసెంబరు 1, 1918న సికింద్రాబాద్‌లోని చిలకలగూడ లో ఒక సామాన్య దళిత కుటుంబంలో ఈశ్వరీబాయి జన్మించారు.
- 1951లో హైదరాబాద్ – సికింద్రాబాద్ నగర పురపాలక సంఘానికి ప్రజాస్వామ్య రీతిలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో చిలకలగూడ వార్డు నుంచి ఈశ్వరీబాయి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
- 1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్ జిల్లాలో కొత్తగా షెడ్యూల్డు కులాల వారికి రిజర్వు చేయబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, టి.ఎస్.సదాలక్ష్మి చేతిలో ఓడిపోయారు. తర్వాత 1967లో జరిగిన ఎన్నికలలో తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
- 1972లో తిరిగి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి సెపరేట్ తెలంగాణ పోరాట సమితి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
- 1978లో జుక్కల్ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ (కాంబ్లే) అభ్యర్థిగా ఈశ్వరీబాయి శాసనసభకు పోటీచేసి సౌదాగర్ గంగారాం చేతిలో ఓడిపోయారు.
- అవసాన దశలో ఈశ్వరీబాయి క్యాన్సరు బారిన పడి ఫిబ్రవరి 25, 1991న హైదరాబాద్‌లో మరణించారు.