అక్షరటుడే, వెబ్డెస్క్ : Inter Exams | పరీక్ష రాస్తుండగా ఫ్యాన్ ఊడి పడి ఓ విద్యార్థిని గాయాలు అయ్యాయి. ఈ ఘటన కరీంనగర్లోని సహస్ర జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని శివాన్విత పరీక్ష రాస్తుండగా ఫ్యాన్ ఊడి పడింది. గదిలో కొక్కెం ఊడిపోయి ఫ్యాన్ పడటంతో రెక్కలు తగిలి శివాన్వితకు గాయాలయ్యాయి. దీంతో సిబ్బంది వెంటనే విద్యార్థినిని పరీక్షా కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి తరలించి చికిత్స చేశారు. అనంతరం మరో గదిలో కూర్చోబెట్టి అరగంట సమయాన్ని అదనంగా కేటాయించి పరీక్ష రాయించారు.
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించినా పలు కాలేజీలు పట్టించుకోలేదు. కొన్ని కేంద్రాల్లో సరిగా వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఫ్యాన్ పడటంతో విద్యార్థి గాయపడింది. అసలు కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు తిరగకపోవడంతో ఉక్కపోతతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో వసతులపై పర్యవేక్షణ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.