అక్షరటుడే, వెబ్‌డెస్క్ Virat Kohli : ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత ఆటగాళ్లు సమిష్టిగా ఆడి కప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. కాని ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక పరుగుకే ఔటై నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే విరాట్ ఔట్ అవ్వగానే 14 ఏళ్ల బాలిక గుండెపోటుకు గురై.. కొద్దిసేపటికే ప్రాణాలు విడిచినట్టు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై బాలిక తండ్రి అజయ్ పాండే ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన కూతురు ఎలా మరణించిందో తెలియజేశారు.తన కుమార్తె మరణానికి కోహ్లీ ఔటవ్వడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Virat Kohli : ఊహించని మరణం..
విషయంలోకి వెళితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రియాంశి ఫైనల్ మ్యాచ్ చూస్తుంది. అప్పటి వరకు బాగానే ఉన్న ప్రియాంశి భారత్ బ్యాటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటి తర్వా త అనుకోకుండా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో తండ్రి అజయ్ పాండే ఇంట్లో లేకపోవడంతో, ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఇంటికి చేరుకొని, ప్రియాంశిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే కోహ్లీ సింగిల్ స్కోరుకే ఔట్ అవ్వగానే ప్రియాంశి చనిపోయిందని జోరుగా ప్రచారాలు సాగాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని బాలిక తండ్రి స్పష్టతనిచ్చారు. పాప అంత్యక్రియలు పూర్తయ్యాక ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
జరిగిన ఘటనపై బాలిక తండ్రి స్పందిస్తూ, “నా కుమార్తె గుండెపోటు వచ్చింది, అది విరాట్ కోహ్లీ వికెట్‌కు సంబంధించింది కాదు. నేను ఇంటి బయట ఉన్న సమయంలోనే ఇది జరిగింది. ఇది కేవలం ఒక యాధృచ్ఛిక సంఘటన మాత్రమే. నా కుమార్తె చనిపోయేటప్పుడు కోహ్లీ బ్యాటింగ్‌కు కూడా రాలేదు అంటూ ప్రియాంశి తండ్రి స్పష్టం చేశారు. ఫైనల్‌గా తన కూతురు చనిపోయేటప్పుడు భారత జట్టు బాగానే ఆడుతోందని, కోహ్లీ అసలు బ్యాటింగ్‌కే రాలేదంటూ బాలిక తండ్రి స్పష్టత ఇవ్వడం తప్పుడు ప్రచారాలకి పులిస్టాప్ పడింది. ప్రియాంశి మరణం క్రికెట్ అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. కొందరు కోహ్లీని బాధ్యత వహించాలని అంటుంటే, మరికొందరు క్రికెట్‌ను కేవలం ఒక ఆటగానే చూడాలని పలు సూచనలు చేస్తున్నారు.