అక్షరటుడే, వెబ్డెస్క్: UV rays | ఈ సమ్మర్ వెకేషన్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా.. వేసవి సెలవుల్లో పిల్లలతో సహా సరదాగా అలా బయట తిరిగొద్దామని అనుకుంటున్నారా అయితే కాస్త జాగ్రత్త. గతంలోలా ఈసారి వేసవి ఉండకపోవచ్చు. ఈ సమ్మర్లో అతినీలలోహిత కిరణాల ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కిరణాల ప్రభావం ఇప్పటికే కేరళలో మొదలైంది. దీంతో అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది.
UV rays | కేరళలో Red Alert
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించడం దేశంలో చర్చనీయాంశంగా మారింది. గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో విపత్తు నిర్వహణ సంస్థ ఈ రెడ్ అలర్ట్ నిర్ణయం తీసుకుంది. పాలక్కాడ్, మళప్పురం జిల్లాలోని త్రితళ, పొన్నణి ప్రాంతాల్లో ఉన్న యూవీ మీటర్లలో ఇది 11 పాయింట్లుగా నమోదైందని తెలిపింది. ప్రజలు అతినీల లోహిత కిరణాల బారిన పడకుండా తగు జాగ్రత్తులు తీసుకోవాలంది.
UV rays | ఆ సమయంలో జాగ్రత్త..
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 మధ్య అతినీలలోహిత కిరణాల ప్రభావం అధికంగా ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది బహిరంగ ప్రదేశాలలో పని చేసేవారు, పర్యాటకులు, వాహనదారులు, చర్మ, కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు నేరుగా అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బయటకి వెళ్లేటప్పుడు నూలు(కాటన్) దుస్తులు, గొడుగులు, కంటి అద్దాలు, టోపీల వంటివి ధరించాలి.
UV rays | ఎక్కడెక్కడంటే..
ఎత్తైన ప్రదేశాలు, ఉష్ణమండల ప్రాంతాలలో సాధారణంగా అతినీలలోహిత కిరణాల ప్రభావం అధిక ఉంటుంది. UV కిరణాలను ప్రతిబింబించే నీరు, ఇసుక వంటి ఉపరితలాలపై కూడా ప్రభావం కనిపిస్తుంది.