అక్షరటుడే, వెబ్‌డెస్క్: Teenmar Mallanna | ఎమ్మెల్సీ(MLC Teenmar Mallanna) తీన్మార్ మల్లన్న సోమవారం అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీశ్‌రావు(Harish Rao)తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబం అంటేనే విరుచుకుపడ్డ మల్లన్న తాజాగా వారిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు ఆయన వారిని కలిసినట్లు తెలుస్తోంది.
Teenmar Mallanna | ధర్నాకు మద్దతు ఇవ్వాలని..
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను అధికార కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇందుకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వారితో పాటు బీజేపీ, ఎంఐఎం నేతలను కూడా ఆయన కలిసి, మద్దతు కోరారు.