అక్షరటుడే, ఇందూరు: scanning centres | జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో గత మూడు రోజులుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు చేపట్టింది. ఇందుకోసం పీసీపీఎన్డీటీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపింది. డీఎంహెచ్‌వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అథారిటీ వద్ద నమోదు చేయించుకున్న స్కానింగ్ మిషన్లు ఉన్న ఆస్పత్రుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సంబంధిత ధ్రువపత్రాలు, నిబంధనలు పాటించని ఆస్పత్రులకు నోటీసులు అందజేస్తున్నారు. స్కానింగ్ మిషన్లను రిజిస్టర్ చేయించిన వైద్యులు మాత్రమే స్కానింగ్ చేయాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. ప్రధానంగా రిఫరల్ స్లిప్ ఇచ్చిన తర్వాతే స్కానింగ్ చేయాలని ఆదేశించారు.
scanning centres | వైద్యుల సంతకం ఉండాల్సిందే..
స్కానింగ్ కోసం వచ్చే గర్భిణుల నుంచి ఫామ్ ఎఫ్‌లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే వైద్యుల సంతకం, గర్భిణి గుర్తింపు కార్డు ఉండాలి. ప్రతిరోజూ స్కానింగ్ రిపోర్ట్స్ ఫారం ఆన్లైన్లో ఎంట్రీ చేస్తూ.. ప్రతినెలా రిపోర్ట్స్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం రికార్డులను మెయింటైన్ చేస్తూ రెండు సంవత్సరాల వరకు భద్రపరచాలి.
scanning centres | ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం..
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనల మేరకు డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టింది. ఇందులో ఒక ప్రోగ్రాం ఆఫీసర్ లేదా డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఒక గైనకాలజిస్ట్, మహిళా రెవెన్యూ అధికారి, మహిళా పోలీస్ ఆఫీసర్, సఖి కన్సల్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను స్కానింగ్ సెంటర్లను పరిశీలించారు. పలు చోట్ల లోపాలను గుర్తించి నివేదిక సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే పలు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి.