అక్షరటుడే, నిజామాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక 11 సార్లు ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులపై పెట్టిన శ్రద్ధను సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై పెట్టడం లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్బన్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
అలా అయితే సీపీ జిల్లా నుంచి వెళ్లిపోవాలి
విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ పోరాడుతుంటే పోలీసులు వారిని అరెస్టు చేసి కేసులు పెట్టారని ఎమ్మెల్యే మండిపడ్డారు. బంద్ విషయమై ముందు రోజే పోలీసు శాఖకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. అయినా ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. వారిని బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీస్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలనుకుంటే జిల్లా నుంచి వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించారు.