అక్షరటుడే, వెబ్‌డెస్క్: washing machine : నేరాలు చేసి సులువుగా తప్పించుకోవాలని చూస్తుంటారు కొందరు నేరస్తులు. కానీ, ఏదో ఒక ఆధారంతో దొరికిపోతుంటారు.
దక్షిణ కొరియా(South Korea)లో ఓ ప్రబుద్ధుడు ఇలానే తన ప్రియురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తప్పించుకునేందుకు తన ప్రియురాలిపైనే నేరాలు మోపి, ఇరికించే ప్రయత్నం చేశాడు. అక్రమ కేసులు నమోదు చేయించాలని చూశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, చివరికి అతగాడే చిక్కుకుని కటకటాల పాలయ్యాడు.
దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి తన ప్రేయసిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడిన కేసులో విచిత్రమైన మలుపు చోటుచేసుకుంది. ఈ నేరానికి సాక్షి(witness)గా ఒక వాషింగ్ మెషిన్(washing machine) నిలిచింది.
washing machine : ఏం జరిగిందంటే..
తన ప్రేయసి విడిపోదామని అన్నందుకు, కోపంతో ఆమెపై 24 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన 2023 మార్చిలో జరిగింది. అతడు ఆమెను రోజుల తరబడి బంధించి, ఆహారం కూడా ఇవ్వకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
SCMP నివేదిక ప్రకారం, బాధితురాలు అతని దగ్గర ఇతర మహిళల రహస్య(sexually explicit) ఫొటోలు, లైంగికదాడి వీడియోలు ఉండటాన్ని గమనించింది. దీనికితోడు అతను అప్పటికే మరో మాజీ ప్రేయసిని అత్యాచారం చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. దీంతో అతడి నుంచి విడిపోవాలని సదరు ప్రేయసి నిర్ణయించుకుంది.
ఇక ప్రస్తుత కేసు విషయానికి వస్తే.. మొదట నిందితుడు తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలను ఖండించాడు. సాక్ష్యంగా బాధితురాలు 39 నిమిషాల సీసీటీవీ వీడియోను సమర్పించింది. కానీ, ఆ వీడియోలో మొదట ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే, సమగ్రంగా పరిశీలించి.. వాషింగ్ మెషిన్ మూతపై పరావర్తనం చెందిన అత్యాచార దృశ్యాలు రికార్డు కావడాన్ని గుర్తించారు.
అలా వాషింగ్ మెషిన్ మూతపై పరావర్తనం(reflecting) చెందడం ద్వారా రికార్డు అయిన వీడియో ఆధారంగా కోర్టు నిందితుడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, అతని అభ్యర్థన మేరకు కోర్టు శిక్షను ఏడేళ్లకు తగ్గించింది.
ఈ కేసులో తీర్పునిచ్చే సమయంలో “నిందితుడి నేరాలు భయంకరమైనవి. కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. బాధితురాలిపై ఒత్తిడి తీసుకురావడానికి కేసులు వేయాలని చూశాడు. ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు అవసరం” అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.