అక్షరటుడే, ఇందూరు: బీజేవైఎం నాయకుల అక్రమ అరెస్టులు సిగ్గుచేటని జిల్లా అధ్యక్షుడు సందగిరి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపునివ్వడంతో నిజామాబాద్‌లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిని పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి నాలుగో టౌన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను ఆపాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేరికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేకపోవడం బాధాకరమన్నారు. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను అదనంగా పెంచాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్‌ని వెంటనే ప్రకటించాలన్నారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు జీవో నంబర్ 46 రద్దుచేసి వారికి న్యాయం చేయాలన్నారు. అన్ని నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేసిన బీజేవైఎం నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్మూర్‌లో..
కలెక్టరేట్‌ల ముట్టడికి బీజేవైఎం పిలుపునివ్వడంతో ఆర్మూర్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.